ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిని తొలగించండి



రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు . విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన న్యాయవాది  రేగు మహేశ్వర్‌ రావు ఈ పిటిషన్  దాఖలు చేశారు.   విచారణ జరిపిన కోర్టు...ప్రతివాదులు ఏపీ గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్‌ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సి.మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషనర్‌  పదవి చేపట్టేందుకు... పదవీ విరమణ చేసిన తరువాత కనీసం మూడేళ్ల గడువు ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా నీలం సాహ్ని నియామకం జరిగిందని పిటిషనర్‌ తెలిపారు. ‘‘నీలం సాహ్ని గత ఏడాది డిసెంబరు 31న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేయకముందే ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తరువాత కొంతకాలానికే 2021 మార్చి 28న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ జీవో జారీచేసింది. ఎన్నికల కమిషనర్‌ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. అధికరణ 243(కె) మేరకు నీలం సాహ్ని నియామకం రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వండి. వ్యాజ్యం పరిష్కారమయ్యేంతవరకు ఎన్నికల కమిషనర్‌ గా విధులు నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి’’ అని పిటిషనర్‌  రేగు మహేశ్వర్‌ రావు కోరారు. ఈ కేసు వివరాలను ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకొన్నారు. ‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకంలో సుప్రీంకోర్టు సూచనలను అనుసరించాలి. వాటి గురించి సుప్రీంకోర్టు మార్చి 12న మరోసారి స్పష్టం కూడా చేసింది. కానీ ఉన్నత న్యాయస్థానం సూచించిన నిబంధనల ప్రకారం నియామకం జరగలేదు. నిబంధనలను ఏవిధంగా పాటించలేదో కోర్టుముందుంచాం’’ అని  రేగు మహేశ్వర్‌ రావు తెలిపారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post