ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆనందయ్య కరోనా ఔషధంపై ఆయుష్ శాఖ అధ్యయనం కొనసాగుతోంది. దీనిపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ఆనందయ్య ఔషధంపై జరుగుతున్న అధ్యయనం వివరాలను ఆయన కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవను అడిగి తెలుసుకున్నారు.తొలుత కిరణ్ రిజిజుకు ఫోన్ చేసిన ఆయన... వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తిచేయాలని సూచించారు. అందుకు కిరణ్ రిజిజు బదులిస్తూ... మంత్రాలయంలోని ఆయుష్ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) ఆధ్వర్యంలో ఆనందయ్య మందుపై అధ్యయనం జరుగుతోందని వెంకయ్యనాయుడికి తెలిపారు.ఆనందయ్య మందు వాడిన 500 మంది నుంచి సేకరించిన సమాచారాన్ని ఈ అధ్యయనంలో వినియోగిస్తున్నారని, త్వరలోనే నివేదిక వస్తుందని తెలిపారు. ప్రజలకు సంబంధించిన ఎంతో ప్రాధాన్యత ఉన్న అంశం కావడంతో, లోతైన అధ్యయనం జరుగుతోందని, దేనిపైనా రాజీపడకుండా వెళుతున్నందున కొంత సమయం పట్టే అవకాశం ఉందని వివరించారు.ఆపై వెంకయ్యనాయుడు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవకు ఫోన్ చేశారు. ఆనందయ్య మందు ఐసీఎంఆర్ పరిధిలోకి రాదని, ఆయుష్ శాఖకు సంబంధించిన అంశం అని బలరాం భార్గవ ఉపరాష్ట్రపతికి వివరించారు. ఇప్పటికే ఆయుష్ శాఖ అధ్యయనం చేస్తున్నందున, ప్రత్యేకంగా ఐసీఎంఆర్ కూడా అధ్యయనం చేయాల్సినంత ఆవశ్యకత లేదని తెలిపారు.కాగా, ఆనందయ్య మందును తీసుకున్న 500 మందితో జాబితా రూపొందించిన అధికారులు, ఆ జాబితాలో ఉన్నవారికి ఫోన్ చేశారు. అయితే, కొందరు స్పందించకపోగా, మరికొందరు తాము ఆ మందు తీసుకోలేదని చెప్పడంతో అధికారులు తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా ఆనందయ్య మందు వేసుకున్నామని కొందరు, కరోనా సోకిన తర్వాతే వేసుకున్నామని కొందరు చెబుతున్నట్టు వెల్లడైంది.
Post a Comment