దేశానికీ స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కొన్ని లక్షల మంది జనం న్యాయసాయానికి నోచుకోవట్లేదని సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. జనానికి న్యాయం అందేలా న్యాయవాదులంతా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) 25వ వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రెండు సమస్యలతో పోరాడుతున్నామన్నారు. పేదరికం, న్యాయసాయం అందకపోవడం వంటివి ఇప్పటికీ ఉన్నాయన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాల గురించి మాట్లాడినా ఇప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికీ వాటిపైనే మాట్లాడాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ఈ విషయాలు ఎప్పుడో మరుగున పడిపోవాల్సినవని, అయినా ఇప్పటికీ వాటితో మనం పోరాడుతూనే ఉన్నామని రమణ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ కొన్ని లక్షల మందికి న్యాయ సాయం అందడం లేదన్నారు. సమాజంలో బలహీన వర్గాల వారి గళాలను లాయర్లంతా వినిపించాలని పిలుపునిచ్చారు.వీలైనచోటల్లా వారికి తోడ్పాటును అందించాలని సూచించారు. విచారణలకు అవసరమయ్యే ఫీజును భరించలేని వారికి సాయం చేయాలన్నారు. సమాజానికి ఎంతో కొంత వెనక్కు ఇచ్చేలా, ప్రజలకు సేవ చేసేలా న్యాయవాదులు కృషి చేయాలని రమణ పిలుపునిచ్చారు.
Post a Comment