నిధుల కోసం కేంద్ర ఆర్థిక మంత్రికి బండి సంజయ్ వినతి

 


కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రహదారుల అభివృద్ధి కోసం సెంట్రల్ రోడ్ ఫండ్ (CRF) కింద నిధులు మంజూరు చేయాలని కోరుతూ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ కు వినతిపత్రం సమర్పించారు. కరీంనగర్ పార్లమెంట్ ఫరిధిలోని - కరీంనగర్, హుస్నాబాద్, మానకొండూర్, హుజూరాబాద్, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ - 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 192.05 కిలోమీటర్ల పొడువు గల 16 వేరువేరు రహదారుల అభివృద్ధి కోసం సుమారు రూ. 310 కోట్లు వ్యయం అవుతుందని, ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరారు. ఇందులో భాగంగా మట్టి  రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయడం, సింగిల్ లేన్ రోడ్డును డబుల్ లేన్ గా మార్చడం, రోడ్లకు సంబంధించిన ఇతర అభివృద్ధి పనులను ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చేపట్టనున్నారు. ఈ రహదారుల అభివృద్ధితో నియోజకవర్గం పరిధిలోని గ్రామాల మధ్య, మండలాల మధ్య, రెవెన్యూ డివిజన్ ల మధ్య రాకపోకలు మరింత సులువు కానుంది. ఫలితంగా ఆర్థికాభివృద్ధి మరింత పుంజుకుంటుందని తెలిపారు. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రహదారులను విశేషంగా అభివృద్ధి చేస్తుందని, తెలంగాణలోనూ కొత్త జాతీయ రహదారులను మంజూరు చేసి, అభివృద్ధి  చేస్తుందని వివరించారు. ఈ క్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వివిధ రహదారుల అభివృద్ధి కోసం మరిన్ని నిధులు మంజూరు చేయించుకునేందుకు బండి సంజయ్ కుమార్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిశారు.  బండి సంజయ్ కుమార్ వినతికి సానుకూలంగా స్పందించిన శ్రీమతి నిర్మలా సీతారామన్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రోడ్ల అభివృద్ధి కోసం సెంట్రల్ రోడ్ ఫండ్(సిఅర్ఎఫ్) కింద నిధులు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post