హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే వాహనం వదులుకోవాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు. అంతేనా.. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో ఇప్పటికే వేలాది వాహనాలు సీజ్ చేశారు. అయితే చట్టానికి భిన్నంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని న్యాయనిపుణులు అసలు విషయం బయటపెట్టారు. వాహనం సీజ్ చేయాలని చట్టంలో ఎక్కడా లేదని అంటున్నారు.
అసలు ఈ విషయం ఇప్పుడు చర్చకు ఎందుకు వచ్చిందంటే.. పంజాగుట్టలో వెంకటేష్‌కు చెందిన వాహనాన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో పోలీసులు సీజ్ చేశారు. అంతటితో ఆగకుండా రోజుల తరబడి పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. దీంతో వెంకటేష్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏ అధికారంతో వాహనాన్ని సీజ్ చేశారు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహనాన్ని సీజ్ చేయాలని ఏ చట్టంలో ఉందో చెప్పాలని పోలీసులను న్యాయస్థానం ప్రశ్నించింది. పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేయాలే తప్ప.. వాహనం సీజ్ చేసి ఇబ్బందులకు గురిచేయవద్దని హైకోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉండగా బ్రీత్ ఎనలైజర్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మద్యం సేవించకపోయినప్పటికీ.. బ్రీత్ ఎనలైజర్‌లో మద్యం సేవించినట్లు వచ్చిన ఘటనలు చాలానే ఉన్నాయి. దీంతో వాహనదారులు అవాక్కవుతున్నారు. అలాంటి సమయంలో చాలా మంది కోర్టుకు వెళ్లి కేసులు కూడా వేశారు.
Post a Comment