2021 సంవత్సరం ఆరంభం నుంచి కొత్త చెక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. రూ. 50 వేలకు మించిన చెక్కుల విషయంలో పలు కీలక అంశాలను బ్యాంకు అధికారులు మరోసారి ధ్రువీకరించుకోవాల్సి వుంటుంది. చెక్కుల జారీ విషయంలో అవకతవకలను నిరోధించడంలో భాగంగా పాజిటివ్ పే విధానాన్ని అమలు చేయనున్నామని ఆర్బీఐ ఈ సందర్భంగా పేర్కొంది.మోసపూరిత లావాదేవీలకు చెక్ చెప్పడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని తయారు చేసినట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా రూ. 50 వేల కన్నా అధిక మొత్తానికి చెక్ ను జారీ చేసిన వ్యక్తి లేదా సంస్థ.. లబ్దిదారుడి పేరు, సొమ్ము మొత్తం వివరాలు, చెక్ నంబర్ ను బ్యాంకుకు తెలియజేయాలి. ఈ వివరాలను వివిధ మార్గాల ద్వారా పంపించవచ్చు. మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, ఎస్ఎంఎస్ ల ద్వారా ఈ వివరాలను పంపాల్సి వుంటుంది. ఈ అంశాలనన్నింటినీ బ్యాంకు అధికారులు రెండోసారి ధ్రువీకరించుకున్న తరువాతే క్లియరెన్స్ ఉంటుంది. ఖాతాదారులు జారీ చేసిన చెక్కులు, జమ చేసిన చెక్కు వివరాలను అధికారులు సీటీఎస్ (చెక్ క్లియరింగ్ సిస్టమ్స్)తో సరిపోల్చుకుంటారు. ఈ సమాచారంలో ఏ మాత్రం తేడా ఉన్నా, ప్రెజెంటింగ్ బ్యాంకులకు సీటీఎస్ నుంచి వెంటనే సమాచారం వెళుతుంది. ఈ కొత్త విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ఇదే సాఫ్ట్ వేర్ ఇండియాలోని అన్ని బ్యాంకులకూ ఇప్పటికే చేరగా, జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. రూ. 50 వేల మొత్తం దాటిన చెక్కులకు ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నా, రూ. 5 లక్షల లోపు సొమ్ము విషయంలో వివరాలు అందించాలా? వద్దా?అన్న విషయం ఖాతాదారుని అభీష్టం. అంతకు మించిన చెక్కులకు మాత్రం ఈ విధానం పాటించడం తప్పనిసరి.
Post a Comment