జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా జరిగిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. బీజేపీ అగ్రనేతలు హైదరాబాదు రావడం, అటు అధికార టీఆర్ఎస్ ను, ఇటు ఎంఐఎంను టార్గెట్ చేసి వారు విమర్శనాస్త్రాలు సంధించడం ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో కనిపించిన కొత్త దృశ్యం. ఇక అసలు విషయానికొస్తే... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాదు పర్యటన సందర్భంగా ఎంఐఎంపైనా విరుచుకుపడ్డారు. ఒకవేళ పాతబస్తీలో రోహింగ్యాలు అక్రమంగా నివాసం ఉంటే హోంమంత్రి ఏంచేస్తున్నట్టు? అని ఇటీవలే అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యల పట్ల అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.రోహింగ్యాలను, బంగ్లాదేశీలను దేశం నుంచి వెళ్లగొట్టాలని అసదుద్దీన్ ఒవైసీని రాసివ్వమనండి... ఆ తర్వాత కేంద్రం స్పందన ఎలా ఉంటుందో చూడండి అంటూ దీటుగా బదులిచ్చారు. బంగ్లాదేశీలు, రోహింగ్యాల అంశం పార్లమెంటులో ఎప్పుడు చర్చకు వచ్చినా వారికి ఎవరు మద్దతుగా నిలబడుతున్నారో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు.
"నేనేదైనా చర్య తీసుకుంటే వీళ్లు పార్లమెంటులో రభస సృష్టిస్తారు. ఎంత బిగ్గరగా ఏడుస్తారో మీరు చూడలేదా? చెప్పండి వాళ్లకు... బంగ్లాదేశీలు, రోహింగ్యాలను వెళ్లగొట్టాలని రాసివ్వమనండి. నేను ఆ పని చేస్తాను. ఎన్నికలప్పుడు ఇలాంటి అంశాలు మాడ్లాడితే ఒరిగేదేమీ ఉండదు" అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.
Post a Comment