భారత్- చైనా సరిహద్దులో కాల్పులు - ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ కల్నల్



భారత్, చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో ఆర్మీ అధికారితో సహా ముగ్గురు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి కల్నల్ సంతోష్ బాబు తెలుగుబిడ్డే. తెలంగాణలోని సూర్యాపేట వాసి. ఈ మేరకు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారమిచ్చారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీహార్ 16వ బెటాలియన్ కు చెందిన సంతోష్ ... ఏడాదిగా చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెలల క్రితమే హైదరాబాద్‌కు బదిలీ అవ్వగా.. లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా తాజా ఘటనతో... సరిహద్దుల్లో ఘర్షణపూరిత వాతావరణ నెలకొంది. నిజానికి గత కొన్ని వారాలుగా లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. దీనిపై ఇరుదేశాల ఉన్నతస్థాయి సైనికాధికారులు చర్చలు జరిపినప్పటికీ... ఉద్రిక్తత తగ్గలేదు.పైగా, సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు రాళ్ళతో దాడి చేసుకున్నారు. ఈ దాడి ఘటనతో సరిహద్దు వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాగా... గాల్వన్ లోయ వద్ద జరిగిన దాడి ఘటనపై భారత సైన్యం స్పందించింది. గత రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, భారత్, చైనా సైనికులు పరస్పరం రాళ్లతో కొట్టుకున్నారని తెలిపింది. ఈ దాడిలో ఓ సైనికాధికారి, మరో ఇద్దరు జవాన్లను భారత్ కోల్పోయిందని, అటు ముగ్గురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. భారత్ సైనికులు సంయమనం పాటించినా తొలుత చైనా సైనికులే రెచ్చగొట్టారని భారత ఆర్మీ ఆరోపించింది.
Previous Post Next Post