టిటిడి భూముల విక్రయం కొత్తేమీ కాదని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు



ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్న అంశం టీటీడీ ఆస్తుల విక్రయం. తమిళనాడులో శ్రీవారి పేరిట ఉన్న 23 ఆస్తుల వేలానికి టీటీడీ సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శల దాడికి దిగాయి. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీ భూముల వేలంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు. గత బోర్డు నిర్ణయాలపైనే సమీక్షించామని తెలిపారు. ఆస్తుల విక్రయంపై బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. భూముల వేలంపై గత బోర్డు సభ్యులే తీర్మానం చేశారని వైవీ వెల్లడించారు.భూముల వేలంపై రెండు బృందాలను ఏర్పాటు చేశామని, అయినా టీటీడీలో అన్యాక్రాంతమైన భూములను అమ్మడం కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. భూములు వేలం తామేమీ ఇప్పుడు కొత్తగా ప్రారంభించింది కాదని, చంద్రబాబు హయాంలోనే భూముల విక్రయం జరిగిందని వివరణ ఇచ్చారు. 1974 నుంచి 2014 మధ్య గత ప్రభుత్వాలు టీటీడీ భూములు విక్రయించాయని వెల్లడించారు. 2016 జనవరి 30న టీడీపీ సబ్ కమిటీ భూముల వేలంపై నిర్ణయం తీసుకుందని, 50 టీటీడీ ఆస్తుల వేలానికి 2016 లోనే తీర్మానం చేశారని వైవీ వివరించారు. టీటీడీ భూముల పరిరక్షణకు మాత్రమే తాము నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post