కరోనా వైరస్ భూతం గత కొన్ని నెలలుగా ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోంది. ఈ రక్కసి నుంచి తప్పించుకోవడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని భావించిన అనేక దేశాలు అత్యవసరాలు మినహా అన్ని వ్యవస్థలను నిలిపివేశాయి. దాంతో రవాణా, పారిశ్రామిక ఉత్పత్తి స్థంభించిపోయాయి. ఈ పరిణామం ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగజేసినా, ప్రపంచ పర్యావరణానికి మాత్రం మేలు చేకూర్చింది. ఎక్కడికక్కడ కాలుష్యం స్థాయులు బాగా తగ్గిపోయాయి. కాలుష్య మేఘాల కారణంగా ఏనాడూ హిమాలయ పర్వతాలను స్పష్టంగా చూడలేని జలంధర్ వాసులు వాయు కాలుష్యం తగ్గిపోవడంతో ఆ సమున్నత పర్వతశ్రేణిని కనులారా తిలకించారు.ఢిల్లీ, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో గాలి స్వచ్ఛత మరింత పెరిగిందని ఆయా సూచికలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ గాలిలో మార్చి 22 వరకు గరిష్టంగా కాలుష్య పరిమాణం 196 మైక్రాన్లుగా నమోదు కాగా, ఇప్పుడది కనిష్టంగా 64 మైక్రాన్లకు చేరింది. గాలిలో కాలుష్యం సగానికంటే ఎక్కువ తగ్గిపోయింది. ప్రపంచంలోని అత్యంత కాలుష్య భరిత ప్రాంతాల్లో ఒకటిగా నిలిచే ఢిల్లీలో ఇప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. అక్కడి వాతావరణంలో కాలుష్యం రేటు 57.64 శాతం తగ్గుదల నమోదైంది. మామూలు పరిస్థితుల్లో ఢిల్లీ గాలిలో కాలుష్యం 300 మైక్రాన్లుగా ఉంటే, లాక్ డౌన్ పర్యవసానంగా అది 76 శాతానికి దిగివచ్చింది.
ఇక, పవిత్ర గంగానది గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గంగానదిని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వాలు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే, ఏళ్ల తరబడి శ్రమించినా జరగని గంగానది ప్రక్షాళన లాక్ డౌన్ కారణంగా కొన్నిరోజుల్లోనే సాకారమైంది. గంగానదిలో ఇప్పుడెక్కడా చెత్త కనిపించడం లేదు సరికదా, అడుగున్న ఉన్న చేపలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గంగానదీ పరీవాహక ప్రాంతాల్లోని పరిశ్రమలన్నీ లాక్ డౌన్ తో మూతపడడం, అనేక పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తుల కారణంగా నదిలో చేరే వ్యర్థాలు ఇప్పుడు లేకపోవడం గంగానదిని పరిశుభ్రంగా మార్చింది.శబ్ద కాలుష్యం సంగతి కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి. వాహనాల రణగొణధ్వనుల నుంచి నగరవాసులకు ఊరట కలుగుతోంది. సాధారణ పరిస్థితుల్లో చెవులు హోరెత్తించే ట్రాఫిక్ ధ్వనులు ఇప్పుడు దాదాపు తగ్గిపోయాయి. ఏదేమైనా కరోనా కారణంగా పర్యావరణానికి మాత్రం గణనీయమైన మేలు జరిగింది. ప్రభుత్వాలు చేయలేనిది కరోనా చేసింది!
Post a Comment