వేలాది మంది పోలీసులు రోడ్లపై ఉంటూ.. క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నారు. కరోనా భూతం నుంచి ప్రజలను కాపాడుకొనేందుకు తమ ప్రాణాలను ఒడ్డుతున్నారు. వారి సేవలకు దేశమంతా నమస్కరిస్తుంటే.. కొంతమంది పోలీసుల దురుసు ప్రవర్తన విమర్శల పాలవుతోంది. తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పోలీసుల వర్గాలను సైతం విస్మయ పరుస్తోంది. ఆ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ADVERTISEMENT
వివరాల్లోకి వెళితే.. సామాన్యులపై పోలీసుల దురుసు ప్రవర్తనను ప్రశ్నిస్తూ లక్ష్మణ్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు. వీడియోను అనుసరించి.. తన కుమారుడితో కలిసి వెళుతున్న ఓ వ్యక్తితో పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఓ కానిస్టేబుల్ ఆ వ్యక్తిని కిందపడేసి విచక్షణా రహింతగా దాడి చేశాడు. అక్కడున్న పోలీసులు అతన్ని విడిపించి జీపులో కూర్చోబెట్టారు. అయితే అక్కడే ఉన్న ఆ వ్యక్తి కుమారుడు బెంబేలెత్తిపోయి.. ‘డాడీ వద్దు.. అంకుల్ ప్లీజ్’ అంటూ కన్నీళ్లతో వేడుకోవడం అందరినీ కలచి వేసింది. ఈ వీడియో కేటీఆర్‌ను చేరడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. కొంతమంది ప్రవర్తనతో వేలాదిమంది కష్టం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలన కోరారు.
Post a Comment