రైల్వే సిబ్బందికీ జీతాల్లో కోత..... ఇందులో నిజమెంత ఉందీ !!!!



న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి  నివారణకు లాక్ డౌన్  చేపట్టిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికి భారీగా గండిపడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన వాటిలో ఇండియన్ రైల్వే సేవలు  కూడా ఒకటి. ప్రయాణికుల నుంచి ఛార్జీలు, సేవా రుసుముల రూపంలో ఆదాయం ఆర్జించే రైల్వే శాఖ అలా వచ్చిన మొత్తంలోంచే సిబ్బందికి జీతాలు చెల్లించేది. కానీ గత నెల రోజులుగా రైల్వే సేవలు కూడా నిలిచిపోవడంతో ఆదాయం కోల్పోయిన రైల్వే శాఖ.. ఆ నష్టాలను పూడ్చుకునే వరకు జీతాల్లో కోత విధించాలని  భావిస్తున్నట్టుగా గత కొద్ది రోజులుగా ఓ ప్రచారం జరుగుతోంది. ఇండియన్ రైల్వేలో పనిచేస్తున్న 13 లక్షల మంది సిబ్బందికి జీతాల్లో కోత విధించే యోచనలో కేంద్రం ఉందనేది ఆ ప్రచారం సారాంశం. భారతీయ రైల్వేకి జీతాల్లో కోత విధించే ఆలోచనలో కేంద్రం ఉందని వస్తున్న వార్తలపై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో  స్పందించింది. రైల్వే శాఖకు సిబ్బంది జీతాలు కట్ చేసే ఆలోచన ఏదీ లేదని.. ఇది జనాన్ని, రైల్వే ఉద్యోగులను తప్పుదోవ పట్టించే విధంగా జరుగుతున్న తప్పుడు ప్రచారం మాత్రమేనని పీఐబి స్పష్టంచేసింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన అనంతరం చోటుచేసుకుంటున్న అనేక పరిణామాలను ఆధారంగా చేసుకుని సోషల్ మీడియాలో అనేక తప్పుడు కథనాలు  వెలువడుతున్నాయి. దీంతో ఆయా ఫేక్ న్యూస్ కథనాలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎప్పటికప్పుడు సవివరమైన ప్రకటన విడుదల చేస్తూ జనానికి సరైన సమాచారం అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే రైల్వే ఉద్యోగులకు వేతనాల్లో కోత అనే ఫేక్ న్యూస్ కథనాలపైనా స్పందిస్తూ పీఐబి ఈ ప్రకటన చేసింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post