ఓ అమ్మాయి విషయంలో గొడవ పడుతున్న రెండు వర్గాల ఆకతాయిలను సముదాయించి, సర్దిచెప్పబోయిన క్రమంలో తానే హత్యకు గురయ్యాడు ఓ టీఆర్‌ఎస్ మండల స్థాయి నాయకుడు. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామంలో నిన్నరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు…టీఆర్‌ఎస్ మండల కమిటీ సభ్యుడైన ఎస్.కె.లతీఫ్ గ్రామంలో కిరాణాషాపు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. లతీఫ్ సోదరుడైన జహంగీర్ కొడుకు తన వాట్సాప్ స్టేటస్‌లో ఓ యువతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ పోస్టింగ్ చూసి తట్టుకోలేని ఓ కాలనీకి చెందిన యువకులు జహంగీర్ కొడుకుపై దాడిచేశారు. ఈ ఘటన తన దుకాణం ఎదుటే జరగడంతో లతీఫ్ ఇరువర్గాలను అడ్డుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రాత్రి గొడవ వద్దని, ఉదయాన్నే కూర్చుని మాట్లాడుకోండని చెప్పగా కోపోద్రిక్తులైన సదరు కాలనీ యువకులు కత్తితో లతీఫ్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Post a Comment