హైదరాబాద్ లో హాస్టళ్ల మూసివేతతో పెద్ద సంఖ్యలో యువత తెలంగాణను వీడి ఏపీలో ప్రవేశించేందుకు రావడంతో తెలుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. కరోనా వైరస్ ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిందని, ఎక్కడివారు అక్కడే ఉండాల్సిందిగా ప్రధాని, సీఎం కోరారని స్పష్టం చేశారు.నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఏపీ వచ్చేందుకు ప్రయత్నించారని, లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోకి వస్తే అనుమతించేది లేదని అన్నారు. రెండు వారాల క్వారంటైన్ తర్వాతే వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. వైరస్ సంక్రమించకుండా ఉండేలా చేయడమే లాక్ డౌన్ ఉద్దేశమని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఏపీలోకి అనుమతించడం అంటే లాక్ డౌన్ స్ఫూర్తిని నీరుగార్చడమేనని అన్నారు.లాక్ డౌన్ పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మెడికల్ షాపులు 24 గంటలు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు, రైతు బజార్లు, పండ్ల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే తెరిచి ఉంటాయని వివరించారు.
Post a Comment