మోదీ ప్రభుత్వం సీఏఏ అమలుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో నిర్వహించిన ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్ సదస్సులో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమంగా పాల్గొన్నారు. తమ ప్రభుత్వం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లోని హింసను ఎదుర్కొంటున్న మైనారిటీలకు భారత్ పౌరసత్వం కల్పిస్తుందన్నారు. ఈ విషయంలో మోదీ సర్కారు వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. “కొన్ని పార్టీలు హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడానికి సీఏఏను ఉపయోగించుకోవాలనుకుంటున్నాయి. ఈ మూడుదేశాల ప్రజలు భారత్ లోకి వచ్చారు. వారివద్ద ఎలాంటి అధికారిక పత్రాలు లేవు. ఏళ్ల తరబడి వారు దేశంలో నరకాన్ని అనుభవిస్తున్నారు. వారికి పౌరసత్వం ఈ బిల్లు ద్వారా దొరుకుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ, లియాఖత్ అలీఖాన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఇరుదేశాల్లో ఉండిపోయిన మైనారిటీలకు మిగతా పౌరులతో సమానంగా హక్కులు కల్పించడం, వారి సుఖమయ జీవనానికి తోడ్పడే పరిస్థితులు కల్పించాలని ఉంది. పాక్, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్ లలో ఇది జరుగలేదు. ఆ దేశాలు ఇస్లాం దేశాలుగా ప్రకటించుకున్నాయి.ఈ నేపథ్యంలో అక్కడ మిగిలిపోయిన మైనారిటీలు హింసను ఎదుర్కొన్నారు. అక్కడనుంచి భారత్ లోకి వచ్చిన అక్కడి మైనారిటీలు ఇక్కడ దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చట్టం తీసుకువచ్చాం. సదరు హింసను ఎదుర్కొంటూ భారత్ లోకి వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తే తప్పేంటి?..” అంటూ అమిత్ షా ప్రశ్నించారు.
Post a Comment