టీఆర్ఎస్ ఎంపీ శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేసముద్రంలో నిన్న ఓ చర్చిలో క్రైస్తవులకు దుస్తుల పంపిణీ సందర్భంగా నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ… రెడ్డి, వెలమ కులాలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ కులస్తులకు మూడు బలుపులుంటాయని… అందులో ఒకటి నేను రెడ్డి, నేను వెలమ అనే బలుపని… రెండోది నా దగ్గర బాగా డబ్బు ఉందనే బలుపని… మూడోది నేను బాగా చదువుకున్నాననే బలుపని అన్నారు. ఈ బలుపులు మనిషికి ఉండరాదని… ఎవరికైనా కోస్తే ఒక రక్తమే వస్తుందని, అందరం తినేది ఒకటే ఆహారమని, అందరి గాలి, నీరు ఒకటేనని చెప్పారు. కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాలని సూచించారు. అబ్రహం లింకన్ తండ్రి చెప్పులు కుట్టేవాడని… ఆయన కూడా కట్టెలు అమ్ముకుని, చెప్పులు కుట్టి, బాగా చదువుకుని అమెరికాకు అధ్యక్షుడు అయ్యారని శంకర్ నాయక్ చెప్పారు. లింకన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత నిర్వహించిన ఒక సభలో ఓ బలిసిన నాయకుడు మాట్లాడుతూ, చెప్పులు కుట్టేవాడి కొడుకు అధ్యక్షుడు అయ్యాడని… ఆయన నాన్నను కూడా ఈ సభకు పిలుస్తున్నారా? అని ప్రశ్నించాడట… ఎవరికీ ఈ బలుపు ఉండకూడదని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Post a Comment