సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. బీసీలంటే సమాజానికి వెన్నుముక లాంటి కులాలు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నవరత్నాలు అమలు చేస్తున్నాం’ అన్నారు. ‘గతంలో సబ్సిడీ రాక చేనేతలు అవస్థలు పడ్డారు. అప్పుల పాలై వారు ఆత్మహత్యలు చేసుకుంటుంటే గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా మన చేనేత పరిశ్రమకు గుర్తింపు ఉన్నా ఇక్కడి నేతన్నల బాధలను పట్టించుకునే వారే అప్పట్లో లేరు. గత పాలకులు నేతన్నలను పట్టించుకోలేదు’ అని జగన్ అన్నారు.’మేము నేతన్నలను అండగా నిలుస్తున్నాం. గత పాలకులు ఆప్కోను లంచాల మయం చేశారు. గతంలో ధర్మవరంలోనే నిరాహార దీక్ష చేశాను. ధర్మవరం చేనేతల పరిస్థితి నాకు తెలుసు. జనవరి 9 నాటికి అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి రూ.15 వేలు సాయం అందిస్తాం’ అని జగన్ తెలిపారు. ‘గత ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసింది. ధర్మవరం నేతన్నలకు ఏ కష్టమొచ్చినా మేము గతంలో ఇక్కడకు వచ్చాము. నేతన్నలకు గత ప్రభుత్వం చేసిన అన్యాయాల పై నిరాహారదీక్షలు చేశాం. నేనున్నానంటూ చేనేతలకు భరోసా ఇచ్చాము’ అని జగన్ అన్నారు.
‘అగ్గిపెట్టెలో పట్టే చీర నేయడం నుంచి స్వాతంత్ర్య ఉద్యమం వరకు నేతన్నలకు గొప్ప చరిత్ర ఉంది. ఆరు నెలల్లో మేము ఇన్ని మంచి పనులు చేశాం. ఏ మతం అన్న విభేదాలు చూపకుండా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. ఇంత చేస్తున్నా కూడా రాజకీయ స్వార్థంతో శత్రువులంతా ఏమేమీ చేస్తున్నారో మీరు గమనిస్తున్నారు. శత్రువులందరూ ఏమేం మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు’ అని జగన్ అన్నారు.’ఇన్ని జరుగుతున్నా కూడా మీ అందరికీ నేను ఒక్కటే తెలుపుతున్నాను. నా బలం మీ ఆశీస్సులు.. దేవుడి దయ మీ చల్లని దీవెనలు. ఇంత కన్నా గొప్పగా ఇంకా మంచి పనులు చేసే అవకాశాన్ని మీ తమ్ముడిగా, మీ బిడ్డగా, మీ ఇంటి సభ్యుడిగా నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని జగన్ వ్యాఖ్యానించారు.
Post a Comment