ఆపదలో వున్న తన భక్తులను ఆదుకోవడానికి హనుమంతుడు ఎంత మాత్రం ఆలస్యం చేయడు. అలాంటి హనుమంతుడిని అనునిత్యం పూజించేవారు వుంటారు .. ఆ స్వామికి ప్రదక్షిణలు చేసిన తరువాతనే తమ దైనందిన కార్యక్రమాలను మొదలుపెట్టేవారు వుంటారు. ఇక స్వామివారికి ప్రత్యేకించి పూజాభిషేకాలు చేయించేవారు మాత్రం, హనుమకు ఇష్టమైన మంగళవారం రోజున అవి చేయిస్తుంటారు. తమలపాకులతో పూజలు చేయించి .. ఆ స్వామికి ఇష్టమైన తీపి అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వలన అనారోగ్యాలు .. ఆపదలు .. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.
ఇక చాలామంది శనివారం రోజున కూడా హనుమంతుడిని పూజిస్తుంటారు .. భక్తి శ్రద్ధలతో సేవిస్తుంటారు. శనివారం రోజున హనుమను పూజించడం వలన, శనిగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శనివారం రోజున హనుమను పూజించేవారి జోలికి రానని ఒకానొక సందర్భంలో శనిదేవుడు .. హనుమకు మాట ఇచ్చాడట. అందువల్లనే శనివారం రోజున హనుమను పూజిస్తే, శని దోష ప్రభావం తగ్గుతూ వెళుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
Post a Comment