పాకిస్తాన్ జైలులో 20 ఏళ్లు గడిపి తాజాగా విడుదలయ్యాడు ఓ భారతీయుడు. నిన్న తన సొంతింటికి వచ్చి కుటుంబ సభ్యులతో గడిపాడు. ఒడిశాలోని సుందర్‌ఘర్ జిల్లాకు చెందిన బ్రిజు కుల్లు అనే గిరిజనుడు 1995లో పాతికేళ్ల వయసులో ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేసి, పంజాబ్ కు చేరుకుంటున్న సమయంలో పొరపాటున పాక్ సరిహద్దుల్లోకి వెళ్లాడు. అది నేరం అని అతనికి తెలియదు. అక్కడ అతనిని గుర్తించిన పాకిస్థాన్ సైనికులు అతనిని భారత గూఢచారిగా అనుమానించారు.దాంతో అరెస్టు చేసి జైలుకి తరలించడంతో 20 ఏళ్లకు పైగా లాహోర్ జైలులోనే గడిపాడు. రెండు వారాల క్రితం అతనిని పాకిస్థాన్ విడుదల చేయడంతో భారత్ చేరుకున్నాడు. 14 రోజుల పాటు అమృత్‌సర్‌లోని కరోనా ఆసుపత్రిలో ఉన్నాడు. నిన్న అతనిని సంబంధిత అధికారులు సొంత గ్రామం జంగతేలికి తీసుకెళ్లారు. ఇన్నేళ్ల తర్వాత సొంగ గ్రామానికి వచ్చిన అతనికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. అతనికి పూలమాలలు వేస్తూ ఆప్యాయంగా పలకరించారు.ఇన్నాళ్లకు ఇంటికి చేరుకున్నందుకు ఆనందంగా ఉందనీ, బంధువులు, స్నేహితులను గుర్తుపడుతున్నానని బ్రిజు చెప్పాడు. పాక్ జైలులో ఒక సెల్ లో తనతో పాటు ఇరవై మంది ఖైదీలను వుంచేవారనీ, సమయానికి ఆహారాన్ని మాత్రం పెట్టేవారని చెప్పాడు. ఎప్పటికైనా ఇంటికి చేరుకోవాలని కోరుకున్నానని, తన ప్రార్థనలు ఫలించాయని అన్నాడు. ఇక తన శేష జీవితాన్ని స్వగ్రామంలోనే గడుపుతానని బ్రిజు చెప్పాడు.
Post a Comment